ఇటీవల మారిన జీవనశైలితో మధుమేహం ఎక్కువమంది ప్రజలను ప్రభావితం చేస్తోంది. చిన్న వయసులోనే షుగర్ స్థాయిలు అదుపులో లేక ఇబ్బందులు పడుతున్నారు. రక్తంలో షుగర్ నియంత్రణ కోసం అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అలాంటి వారికి జామ ఆకులు సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ రెండు మూడు ఆకులను నమిలి తినడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
జామ ఆకులు రక్తంలో షుగర్ స్థాయులను నియంత్రించడంలో సహాయపడతాయి. అవి కార్బోహైడ్రేట్లను శరీరం వేగంగా సంగ్రహించకుండా అడ్డుకుంటాయి. జామ ఆకుల్లోని ముఖ్యమైన రసాయనాలు ఇన్సులిన్‌కు శరీరం స్పందించే విధానాన్ని మెరుగుపరిచే లక్షణాలను కలిగి ఉంటాయి. తద్వారా రక్తంలో షుగర్ హఠాత్తుగా పెరగకుండా, తగ్గకుండా నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
జామ ఆకుల్లో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. మధుమేహ బాధితులకు తరచుగా ఏర్పడే మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అంతేకాకుండా, అవి చెడు కొలెస్ట్రాల్ (ఎల్ డీఎల్) స్థాయులను తగ్గించి గుండె సంబంధిత వ్యాధులను నివారించగలవని సూచిస్తున్నారు.
పరిశోధనల ప్రకారం, జామ ఆకులు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరిచే గుణాలను కలిగి ఉంటాయి. అమెరికన్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) చేసిన అధ్యయనంలో మధుమేహ నియంత్రణకు జామ ఆకులు ప్రయోజనకరమని తేలింది. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించి, పాంక్రియాస్ ఆరోగ్యాన్ని కాపాడతాయని పరిశోధకులు తెలిపారు.