అమెరికాలో గ్రీన్ కార్డ్ ఉన్న భారతీయులు కొత్త సమస్యలను ఎదుర్కొంటున్నారు. విమానాశ్రయాల్లో అదనపు భద్రతా తనిఖీలు, గంటల తరబడి ప్రశ్నలు అనివార్యమయ్యాయి. ట్రంప్ ప్రభుత్వం ఇమిగ్రేషన్ చట్టాలను మరింత కఠినతరం చేయడంతో ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయని అంటున్నారు. అక్రమ వలసదారులపై చర్యలతో పాటు, గ్రీన్ కార్డ్ హోల్డర్లపైనా ఆంక్షలు పెరిగినట్లు తెలుస్తోంది.
ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇచ్చిన ప్రకటనలో – గ్రీన్ కార్డ్ ఉన్నంత మాత్రానా శాశ్వత నివాసం హక్కు కలిగిందని భావించడం పొరపాటని తెలిపారు. ముఖ్యంగా ఆరు నెలల పాటు విదేశాల్లో గడిపిన తర్వాత తిరిగి అమెరికాలో అడుగుపెట్టే వారిపై ప్రత్యేకంగా ప్రశ్నలు నిర్వహిస్తున్నారని సమాచారం. ఇది భారత సంతతి గ్రీన్ కార్డ్ హోల్డర్లు, హెచ్ 1 బి వీసాదారులు, ఎఫ్ 1 వీసాపై ఉన్న విద్యార్థుల్లో గుబులు రేపుతోంది.
న్యాయవాదుల సూచనల ప్రకారం, ప్రయాణాల సందర్భంగా అధికారిక పత్రాలను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. గ్రీన్ కార్డ్ హోల్డర్లు తమ కార్డును ముందుగానే రీన్యూవ్ చేయించుకోవాలి. హెచ్ 1 బి వీసాదారులు తాజా పే స్లిప్, విద్యార్థులు కాలేజీ లేదా యూనివర్సిటీ ధృవపత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు.
అదేవిధంగా, అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ నుంచి వచ్చిన ప్రకటనలో, అదనపు తనిఖీలు తప్పవని, గంటల పాటు ప్రశ్నించబడినా ఓర్పు వహించాలని కోరారు. ఇమిగ్రేషన్ అధికారులు మరింత కఠినతరమైన చర్యలు చేపట్టే అవకాశముందని, భారతీయులందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

 
				 
				
			 
				
			 
				
			