పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ రవీంద్రభారతి పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన సైన్స్ ఎక్స్పో అంగరంగ వైభవంగా జరిగింది. విద్యార్థులలోని సృజనాత్మకతను వెలికితీయడం, శాస్త్రీయ అవగాహన పెంపొందించడం లక్ష్యంగా యాజమాన్యం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు, నమూనాలు పాఠశాల ఆవరణలో ప్రదర్శించగా, అవి అటువంటి ప్రయోగాత్మక విద్యకు నిదర్శనంగా నిలిచాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డిప్యూటీ డీఈఓ పి. కృష్ణమూర్తి మాట్లాడుతూ, శాస్త్రీయ పరిశోధనలు, అవగాహన పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. విద్యార్థులు ప్రాజెక్టుల రూపంలో తమ ఆలోచనలను వ్యక్తపరచడం, ఇతరులతో పంచుకోవడం వల్ల కొత్త ఆవిష్కరణలు సుసాధ్యమవుతాయని గౌరవ అతిథిగా విచ్చేసిన ఎంఈఓ కె. సోంబాబు అన్నారు.
శాస్త్ర పరిశోధనల వల్ల విద్యార్థుల ఆలోచనా శక్తి పెరుగుతుందని, భవిష్యత్తులో వారు మరింత రాణించడానికి ఈ ఎక్స్పో సహాయపడుతుందని పాఠశాల చైర్మన్ ఎంఎస్ మణి అన్నారు. విద్యార్థులు చిన్న వయసులోనే విజ్ఞానశాస్త్రంలోని మెలకువలను నేర్చుకోవడం ద్వారా దేశ ప్రగతికి దోహదపడతారని నార్తాంద్ర జోనల్ ఇంచార్జ్ ఎన్. వెంకటేష్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పి. భవాని ప్రసాద్, డివిజనల్ ఇంచార్జ్ చుక్క శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులు, శాస్త్రీయ నమూనాలు హాజరైన అతిథులను ఆకట్టుకున్నాయి.
