భీష్మ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నర్సీపట్నం శ్రీ షిరిడిసాయి ఆలయంలో 23వ లక్ష ప్రమిదల దీపారాధన మహోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఆయన సతీమణి, కౌన్సిలర్ చింతకాయల పద్మావతి ఆలయాన్ని సందర్శించారు. వీరిని ఆలయ కమిటీ వేద పండితులు వేద మంత్రాలతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వాదాలు పొందారు.
ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు భక్తులకు భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు. లక్ష ప్రమిదల దీపారాధన గత 23 సంవత్సరాలుగా భక్తుల సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆలయ అభివృద్ధికి భక్తుల సాయంతో అన్ని ఏర్పాట్లు చేశామని, దీపారాధన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా సాయంత్రం 5:00 గంటలకు ఎన్.టి.ఆర్. మినీ స్టేడియంలో దీపారాధన ప్రారంభమవుతుందని చెప్పారు.
ఆలయ కమిటీ ప్రెసిడెంట్ చింతల పాత్రుడు మాట్లాడుతూ భక్తుల విశ్వాసంతో 23వ దీపారాధన మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉదయం కాకడ హారతితో ప్రార్థనలు ప్రారంభమై, 6:30 గంటలకు నిత్యపూజ, హోమం, అభిషేకాలు నిర్వహించామని తెలియజేశారు. మధ్యాహ్నం 12:00 గంటలకు స్వామివారికి మహా హారతి సమర్పించి అన్నసమారాధన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఆలయ కమిటీ, భక్తులు కలిసి అయ్యన్నపాత్రుడు దంపతులను సత్కరించారు. ఆలయ అభివృద్ధికి చేసిన సహాయాన్ని గుర్తిస్తూ వీరికి ప్రత్యేకంగా షీల్డ్ బహుకరించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. భక్తులంతా దీపారాధన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ నిర్వాహకులు కోరారు.