పార్వతీపురం మన్యం జిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో సాగవుతున్న జీడిమామిడి పంట రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఈనెల 10న కురుపాం మండలం లేవిడి గ్రామంలోని రబ్బర్ తోటలో జిల్లా సదస్సు నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు తెలిపారు. రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
వీరఘట్టం మండలం తూడి గ్రామంలో రైతులతో జరిగిన సమావేశంలో అప్పలనాయుడు మాట్లాడుతూ, జీడిమామిడి పంట అమ్ముకునే సమయంలో దళారులు, వ్యాపారులు రైతులను దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల్ని రక్షించేందుకు ప్రభుత్వం జీడిమామిడికి క్వింటాకు ₹20,000 మద్దతు ధర ప్రకటించాలని, ధాన్యం సేకరణ మాదిరిగా గ్రామ రైతు సేవా కేంద్రాల ద్వారా జీడిని కొనుగోలు చేయాలని సూచించారు.
వాతావరణ మార్పుల ప్రభావంతో పంట నష్టపోతున్నదని, తేనె మంచు వంటి సమస్యలతో దిగుబడి తగ్గిపోతున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ నష్టాన్ని నివారించేందుకు కావాల్సిన రసాయన ఎరువులను, పిచికారీ యంత్రాలను ఉచితంగా రైతులకు సరఫరా చేయాలని రైతు సంఘం ప్రభుత్వాన్ని కోరింది. అలాగే, జీడిమామిడి ఉప ఉత్పత్తులకు ప్రోత్సాహం ఇవ్వాలని, రైతుల ఆదాయాన్ని పెంచే విధంగా విధానాలు రూపొందించాలని డిమాండ్ చేశారు.
ఈ సదస్సు విజయవంతం చేయాలని, రైతులందరూ అందులో భాగస్వామ్యం కావాలని రైతు సంఘం పిలుపునిచ్చింది. ప్రచార కార్యక్రమంలో చంద్రక కేశవరావు, బొత్స గౌర్నాయుడు, చందక నారాయణరావు, జమ్ము చిన్నం నాయుడు, రావాడ దుర్గారావు, గడసాన ఇక్కయ్య, మొయ్యి ఉగాది, ఇరువాడ ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.