బంగారం ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. కొత్త గరిష్టాలను నమోదు చేస్తూ పసిడి మళ్లీ రికార్డు స్థాయికి చేరింది. 99.9 ప్యూరిటీ గోల్డ్ ధర మంగళవారం రూ.500 పెరిగి రూ.91,250కి చేరుకుంది. అలాగే, 99.5 ప్యూరిటీ గోల్డ్ రూ.450 పెరిగి రూ.90,800గా నమోదైంది. బంగారం ధరల పెరుగుదల కొనుగోలుదారులను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారానికి భారీ డిమాండ్ ఉండటంతో ధరలు రికార్డు స్థాయికి చేరాయి. మల్టీ కమోడిటీ ఎక్సేంజ్ (ఎంసీఏక్స్)లో 10 గ్రాముల ఫ్యూచర్స్ ధర రూ.649 పెరిగి రూ.88,672గా ఉంది. స్పాట్ మార్కెట్‌లో ఔన్స్ ధర 3,028.49 డాలర్లకు చేరగా, కామెక్స్‌లో ఔన్స్ ధర 3,037.26 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు, వెండి ధర కిలోకు రూ.1,02,500 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
యూఎస్ ఫెడరల్ రిజర్వ్ త్వరలో సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో వడ్డీ రేట్లలో కోత విధించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే జరిగితే, బంగారం ధరలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాదు, చైనా భారీగా బంగారం నిల్వలను పెంచాలని నిర్ణయించడంతో ధరలు మరింత పెరగనున్నాయి.
అంతర్జాతీయ సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నాయి. మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి, ఆర్థిక ఒడిదుడుకుల కారణంగా బంగారం పెట్టుబడిదారులకు భద్రతగా మారుతోంది. దీంతో పసిడి రేటు రికార్డు స్థాయికి చేరుకుంటూ, మరింత పెరిగే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 
				 
				
			 
				
			 
				