బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సోషల్ మీడియా వేదికగా అవామీ లీగ్ కార్యకర్తలతో సంభాషిస్తూ హృదయాన్ని హలికించేవిధంగా మాట్లాడారు. దేవుడు తనను ఇంకా బతికించాడని, ఇది యాదృచ్ఛికం కాదని, బంగ్లాదేశ్ ప్రజలకు తన ద్వారా ఏదైనా మంచి చేయాలన్న ఆలోచనతోనే భగవంతుడు తనను రక్షించాడని తెలిపారు. త్వరలోనే తాను బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చి ప్రజల కోసం పోరాడతానని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా అవామీ లీగ్ కార్యకర్తలు, నాయకులపై జరిగిన దాడులను ప్రస్తావించిన హసీనా, దీనికి కారణమైన వారికి తగిన శిక్ష తప్పదని హెచ్చరించారు. న్యాయం ఆలస్యం కావొచ్చు కానీ తప్పకుండా జరుగుతుందన్న విశ్వాసం మనందరిలో ఉండాలని అన్నారు. అవామీ లీగ్ కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.
తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్‌పై తీవ్ర విమర్శలు చేసిన హసీనా, ఆయనను ప్రజలను ప్రేమించని వ్యక్తిగా అభివర్ణించారు. అత్యధిక వడ్డీకి రుణాలు ఇచ్చి ప్రజలను ఇబ్బందుల పాలు చేశారని, అదే సమయంలో విదేశాల్లో విలాసవంతమైన జీవితాన్ని గడిపారని ఆరోపించారు. అలాంటి వారిపై ప్రజలు త్వరలో తగిన తీర్పు ఇస్తారని అన్నారు.
దేశంలో భద్రత పరిస్థితి దారుణంగా ఉందని, అత్యాచారాలు, హత్యలు, దొంగతనాలు పెరిగాయని హసీనా ఆందోళన వ్యక్తం చేశారు. మీడియా వ్యక్తులకూ బెదిరింపులు వస్తున్నాయని, నేరాలు బయటపడకపోతున్నాయని తెలిపారు. తాను పుట్టింది ప్రజల కోసం సేవ చేయడానికేనని, తన తండ్రి సహా కుటుంబం మొత్తం హత్యకు గురైనప్పటికీ భగవంతుడు తనను నిలబెట్టడం వెనుక ఓ ఆశయముందని పేర్కొన్నారు.