మహారాష్ట్రలో గిలియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) కేసులు పెరుగుతున్నాయి. తాజాగా, ఒకరు మరణించగా, రాష్ట్రవ్యాప్తంగా 101 కేసులు నమోదయ్యాయి. మృతికి గల కారణంపై స్పష్టత రానప్పటికీ, వైద్యులు జీబీఎస్ కారణంగా మరణించి ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం 16 మంది రోగులకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. రాష్ట్రంలో ఈ వ్యాధి కలకలం రేపుతున్న నేపథ్యంలో వైద్యులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
జీబీఎస్‌కు రోగనిరోధక శక్తి బలహీనత ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా శరీరంలోకి ప్రవేశించే ఇన్ఫెక్షన్‌పై రోగనిరోధక వ్యవస్థ పోరాడుతుంది. కానీ, జీబీఎస్ బాధితుల శరీరంలో రోగనిరోధక వ్యవస్థ నరాలపై దాడి చేస్తుందని తెలిపారు. ఇది చాలా అరుదుగా జరిగే సమస్య అని, దీని కారణంగా కండరాల బలహీనత, తిమ్మిర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయని వైద్యులు వివరించారు.
కలుషిత ఆహారం, నీటితో శరీరంలోకి ప్రవేశించే కాంపిలో బ్యాక్టర్ జెజునీ వల్లే తాజా జీబీఎస్ కేసులు నమోదయ్యాయని అనుమానిస్తున్నారు. ఈ ఇన్ఫెక్షన్ వల్ల రోగనిరోధక వ్యవస్థ పొరపాటు చేసి నరాలను దెబ్బతీస్తుందని వైద్యులు తెలిపారు. దీనివల్ల డయేరియా, జ్వరం, వాంతులు, పొత్తికడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయని తెలిపారు. ప్రతి వెయ్యి మందిలో ఒకరికి మాత్రమే ఈ వ్యాధి వచ్చే అవకాశముందని నిపుణులు స్పష్టం చేశారు.
జీబీఎస్ అంటువ్యాధి కాదని, ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదని వైద్యులు వెల్లడించారు. అయితే, దీని చికిత్స చాలా ఖరీదైనదని తెలిపారు. ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్ల ధర వేలల్లో ఉంటుందని వెల్లడించారు. దీంతో మహారాష్ట్ర ఆర్థిక మంత్రి అజిత్ పవార్, బాధితులకు ఉచిత వైద్యం అందించనున్నట్లు ప్రకటించారు.