గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో ఈనెల 14న జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరావు గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కేసులో తొలుత మిస్సింగ్‌గా నమోదైన మైనర్ బాలికపై ఎనిమిది మంది మూడు రోజులు పాటు అత్యాచారం చేశారని విచారణలో వెల్లడైంది.
జి.కొండూరు ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక తన స్నేహితుల ఇంటికి వచ్చి అదృశ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆత్కూరు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. వెంటనే 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ఆధునిక సాంకేతిక పరికరాలు, సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లకు లుక్‌ఔట్ నోటీసులు పంపారు.
దర్యాప్తులో భాగంగా ఈనెల 17న మాచవరం పోలీస్ స్టేషన్ నుంచి బాలిక ఆచూకీ లభించిందని సమాచారం అందింది. ఆత్కూరు పోలీసులు బాలికను వెనక్కి తీసుకువచ్చి విచారణ నిర్వహించారు. వీరపనేనిగూడెం గ్రామ శివారులోని ఓ వెంచర్‌లో ఎనిమిది మంది యువకులు మైనర్ బాలికపై అత్యాచారం చేసినట్టు తేలింది.
ప్రస్తుతం వీరపనేనిగూడెంకు చెందిన బాణావతు లక్ష్మణ జితేంద్ర కుమార్ నాయక్ (25), పగడాల హర్షవర్ధన్ (25) ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో మిగిలిన ఆరుగురిని త్వరలో అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరుస్తామని ఎస్పీ గంగాధరావు తెలిపారు. బాలిక భద్రత, తల్లిదండ్రుల బాధ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, సెల్‌ఫోన్ వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.