గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ దర్శకుడు శంకర్ కాంబోలో వస్తున్న భారీ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి, జనవరి 10న విడుదల కానుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో, అభిమానులు టీజర్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
తాజాగా, అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ‘గేమ్ ఛేంజర్’ టీజర్ నవంబర్ 9న విడుదల కానున్నట్లు ప్రకటించారు. ప్రత్యేకంగా లక్నో వేదికగా టీజర్ లాంచ్ జరగనుంది. ఉత్తరభారతంలో ఈ వేడుకను జరపాలన్న శంకర్ నిర్ణయం ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరుస్తోంది.
యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు. నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, సముద్రఖని, హ్యారీ జోష్, జయరామ్ వంటి ప్రముఖులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తుండగా, ఎస్‌ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.
