ఐపీఎల్‌లో భాగంగా నేడు ఢిల్లీ కేపిటల్స్‌తో చెపాక్ స్టేడియంలో జరగనున్న కీలక మ్యాచ్‌కు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో కీలక మార్పు జరగే సూచనలు కనిపిస్తున్నాయి. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో మహేంద్ర సింగ్ ధోనీ మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం.
గైక్వాడ్ ఇటీవల గువాహటిలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడ్డాడు. అప్పటి నుంచి అతను ప్రాక్టీసులకు దూరంగా ఉన్నాడు. అయినా గైక్వాడ్ నేటి మ్యాచ్ కోసం ట్రైనింగ్‌లో కనిపిస్తే తాను ఆడే అవకాశముందని చెన్నై బ్యాటింగ్ కోచ్ మైఖేల్ హస్సీ ఆశాభావం వ్యక్తం చేశాడు. అయితే పరిస్థితి అనుకూలించకపోతే ధోనీకి బాధ్యతలు అప్పగించేందుకు జట్టు సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించాడు.
ధోనీ అయితే ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడు. ఇప్పటి వరకు మొత్తం 266 మ్యాచ్‌లకు నాయకత్వం వహించిన ధోనీ, 133 విజయాలను సాధించి తన కెప్టెన్సీ ప్రతిభను రుజువు చేశాడు. సీఎస్‌కే జట్టును పదిసార్లు ఫైనల్స్‌కు తీసుకెళ్లిన ధోనీ, ఐదు సార్లు ట్రోఫీ గెలిపించాడు. కెప్టెన్సీలో తిరిగిరాని గుర్తింపు సాధించిన అతడు మళ్లీ ముందుండి జట్టును నడిపిస్తే అభిమానులకు ఇది పెద్ద పండుగే.
ఈ నేపథ్యంలో గైక్వాడ్ ఆరోగ్య పరిస్థితిపై ఇంకా స్పష్టత రాకపోయినా, ధోనీ నాయకత్వంలో నేటి మ్యాచ్‌కు చెన్నై బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, గైక్వాడ్‌తో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని హస్సీ తెలిపారు. మరోవైపు అభిమానులు మాత్రం మళ్లీ ధోనీ నాయకత్వం చూడాలని ఆశిస్తున్నారు.