పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలో యస్ సొసైటీ సహకారంతో పుష్పగిరి కంటి ఆసుపత్రి విజయనగరం వారి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించబడింది. ఈ శిబిరం గుమ్మలక్ష్మీపురం మండలంలోని గిరిశిఖర ప్రాంతమైన నెల్లి కిక్కవ పంచాయితీ వాడపుట్టి, దుడ్డుకల్లు పంచాయితీ కొత్తవలస గ్రామాల్లో ఏర్పాటు చేయడమైనది.
ఈ శిబిరంలో మొత్తం 184 మందికి కంటి తనిఖీలు నిర్వహించారు. వీరిలో 43 మందిని శస్త్ర చికిత్స కోసం విజయనగరం పంపించారు. వీరికి శస్త్ర చికిత్స పూర్తయ్యాక, కళ్లద్దాలు, మందులు ఉచితంగా ఇచ్చి, మూడు రోజుల తరువాత వారికి తిరిగి స్వస్థలాలకు తీసుకెళ్లి, శస్త్ర చికిత్సను పూర్తిగా నిర్వహించనున్నట్లు పుష్పగిరి CSR మేనేజర్ రమదేవి తెలిపారు.
మరియు, వారు ఈ కార్యక్రమానికి సహకరించిన యస్ సొసైటీ, నెల్లి కిక్కవ పంచాయితీ సర్పంచ్ సోములు, స్థానిక యువజన సంఘం సభ్యులు పువ్వుల హరీష్, జయరాజ్, రవి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని గిరిజన గ్రామాల్లో ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో యస్ సొసైటీ కార్యదర్శి షేక్ గౌస్ మాట్లాడుతూ, “ఇంతకు మునుపెన్నడూ వాదపుట్టి లాంటి మారుమూల గ్రామాలకు వైద్యులు సేవలు అందించడమే నిజంగా అభినందనీయం,” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమర్, మౌనిక మరియు సిబ్బంది పాల్గొన్నారు.

 
				 
				
			 
				
			 
				
			