ప్రత్యేక పూజలు చేస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయని నమ్మించి ఓ మహిళను మోసం చేసిన అఘోరీ ప్రస్తుతం చిక్కుల్లో ఉన్నాడు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అరెస్టు చేసి, కోర్టు ముందు హాజరుపరిచారు. చేవెళ్ల కోర్టు ఈ కేసులో 14 రోజుల రిమాండ్ విధించింది.
వివరాల్లోకి వెళితే, వ్యక్తిగత సమస్యలతో బాధపడుతున్న ఓ మహిళ, ఆ అఘోరీ వద్దకు వెళ్లింది. తన సమస్యలకు పరిష్కారం చూపుతానని చెప్పిన అతను, ప్రత్యేక పూజలు చేస్తానని నమ్మక పెడుతూ దశలవారీగా ₹10 లక్షలు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కానీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.
పోలీసులు వెంటనే స్పందించి అఘోరీని అరెస్టు చేశారు. అనంతరం కోర్టుకు హాజరుపరిచారు. న్యాయమూర్తి అందుబాటులో ఉన్న ఆధారాలు పరిశీలించి, 14 రోజుల న్యాయహిరాసతకు ఆదేశించారు. దీంతో అఘోరీని సంగారెడ్డి సబ్ జైలుకు తరలించారు. అతనిపై విచారణ కొనసాగుతున్నది.
ఇటీవల అఘోరీ వర్షిణి అనే యువతిని పెళ్లి చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. పోలీసుల అదుపులోకి వచ్చినప్పుడు వీరిద్దరూ మధ్యప్రదేశ్, యూపీ సరిహద్దుల్లో ఉన్నారు. వర్షిణిని కౌన్సిలింగ్ సెంటర్‌కు తరలించినట్టు సమాచారం. అఘోరీ మాత్రం తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి దర్యాప్తుకు సహకరిస్తానని తెలిపాడు.
