తిరుమల శ్రీవారి హుండీ లెక్కింపులో భారీ అవకతవకలు వెలుగు చూసాయి. టీటీడీ సీనియర్ అసిస్టెంట్ కృష్ణ కుమార్ హుండీలో వచ్చిన విదేశీ కరెన్సీని దారి మళ్లించినట్లు టీటీడీ విజిలెన్స్ వింగ్ గుర్తించింది. ప్రతి నెల 1వ తేదీ పరకామణిలో జమ చేయాల్సిన విదేశీ కరెన్సీ లెక్కింపులో తేడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
కృష్ణ కుమార్ గత సంవత్సరం ఒక నెలలోనే రూ. 6 లక్షల విలువైన విదేశీ కరెన్సీ స్వాహా చేసినట్లు ఆధారాలు లభించాయి. ఈ వ్యవహారం టీటీడీ విజిలెన్స్ వింగ్ దృష్టికి రావడంతో లోతుగా దర్యాప్తు చేపట్టింది. లెక్కింపులో తేడాలు ఉన్నట్లు స్పష్టమయ్యేంత వరకు టీటీడీ ఉద్యోగుల తీరుపై గట్టిగా నిఘా పెట్టింది.
దర్యాప్తులో సీనియర్ అసిస్టెంట్ కృష్ణ కుమార్ అవకతవకలకు పాల్పడినట్లు నిర్ధారణ అయినట్లు విజిలెన్స్ వింగ్ నివేదికలో పేర్కొంది. వెంటనే ఈ నివేదికను టీటీడీ ఈవో శ్యామలరావుకు సమర్పించింది. హుండీ లెక్కింపులో అవకతవకలు జరగడం భక్తుల్లో కూడా ఆందోళన కలిగించింది.
విజిలెన్స్ నివేదిక ఆధారంగా ఈవో శ్యామలరావు కృష్ణ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరింత కఠిన నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించారు. టీటీడీ హుండీ నిర్వహణను మరింత పారదర్శకంగా చేయాలని భక్తులు కోరుతున్నారు.
