మనం తినే ఆహారం, తగినంత నీళ్లు తాగకపోవడం, మారిన జీవన శైలి వంటివి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి కారణం అవుతున్నాయి. ఇటీవలి కాలంలో ఈ సమస్యతో బాధపడుతున్నవారి సంఖ్య పెరిగిపోతూ ఉంది. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటం, అవి జారిపోయి మూత్రనాళం మధ్యలో చిక్కుకోవడంతో విపరీతమైన నడుము నొప్పితో, ఇతర సమస్యలతో చాలా మంది ఇబ్బందిపడుతున్నారు. అయితే ఎనిమిది రకాల ఆహారంతో కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశాలు పెరుగుతాయని… అందువల్ల బాధితులు వాటికి దూరంగా ఉంటే ప్రయోజనమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఆక్సలేట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే, అది కిడ్నీల్లో కాల్షియంతో కలసి, కాల్షియం ఆక్సలేట్ రాళ్లుగా ఏర్పడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. పాలకూర, బీట్ రూట్, చిలగడ దుంప, వాల్ నట్స్, చాకోలెట్ వంటి వాటిలో ఆక్సలేట్లు ఎక్కువగా ఉంటాయని వివరిస్తున్నారు. అలాగని వీటిని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని… పరిమిత స్థాయిలో తీసుకుంటే మేలు అని పేర్కొంటున్నారు.
ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారం మనం పరిమితికి మించి తీసుకుంటే, శరీరం నుంచి కాల్షియం బయటికి పోతుందని, ఈ క్రమంలో మూత్రం ద్వారా కాల్షియం బయటికి వెళ్లే క్రమంలో కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రాసెస్డ్ ఫుడ్, సోడియం ఎక్కువగా ఉండే స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ లలో ఉప్పు చాలా ఎక్కువగా ఉంటుందని గుర్తు చేస్తున్నారు.
మాంసాహారం, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారం, ప్యూరిన్ ఎక్కువగా ఉండే ఫుడ్స్, పాల, కెఫీన్, ఆల్కాహాలిక్ డ్రింక్స్ వంటి వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ ఆహార పదార్థాలు కిడ్నీల్లో రాళ్లు ఏర్పడేందుకు దారితీసే అవకాశం ఉన్నా, వాటిని తగ్గించి, పరిమిత స్థాయిలో తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.