గన్నవరంలోని లిటిల్ లైట్స్ అనాధాశ్రమంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. శ్రమంలో మొత్తం 140 మంది విద్యార్థులు ఉంటుండగా, మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. విద్యార్థులు భయంతో పరుగులు పెట్టారు. వెంటనే స్థానికులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
అగ్ని ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో కొంతమంది విద్యార్థులు ఆశ్రమంలోనే చిక్కుకుపోయారు. వీరిని స్థానికులు తలుపులు పగలగొట్టి బయటకు తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. గాయపడినవారిని 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదానికి కారణం ఇప్పటి వరకు తెలియరాలేదు. విద్యార్థులు ప్రమాదం నుంచి బయటపడేందుకు తీవ్రంగా శ్రమించారు. కొన్ని సామగ్రి పూర్తిగా కాలిపోయినప్పటికీ, ప్రాణ నష్టం జరగకపోవడం అందరికీ ఊరట కలిగించింది.
అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, అగ్ని ప్రమాదానికి గల కారణాలను విచారిస్తున్నారు. ఆశ్రమంలో భద్రతా ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుని మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడ్డారు.
