తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని ఇరిగేషన్ ప్రాజెక్టు నుండి యావపూర్ ఫామ్ హౌస్‌లకు అక్రమంగా నీటిని తరలిస్తున్నారని ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రి గుట్టుచప్పుడు కాకుండా బీటీ రోడ్డును తవ్వి పైప్‌లైన్ వేశారని ఆరోపించారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా నీటి తరలింపును సమర్థిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులు తమకు సరఫరా కావాల్సిన నీటిని ఫామ్ హౌస్‌లకు అక్రమంగా తరలించడాన్ని తీవ్రంగా ఖండించారు. తాము సాగు నీటి కోసం ఇబ్బందులు పడుతుంటే, ఫామ్ హౌస్‌లకు నీరు అందజేయడమేంటని ప్రశ్నించారు. వెంటనే ఈ అక్రమ నీటి తరలింపును అడ్డుకోవాలని, లేనిపక్షంలో తీవ్ర స్థాయిలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఇరిగేషన్ అధికారులు మాత్రం తమ వంతు సమాధానం ఇస్తూ మేమెవరికి అనుమతి ఇవ్వలేదని, అర్థరాత్రి సమయంలో ఈ వ్యవహారం జరిగిందని పేర్కొన్నారు. అయితే దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని, పైప్‌లైన్ తొలగిస్తామని హామీ ఇచ్చారు. కానీ రైతులు మాత్రం అధికారుల హామీలతో తాము సరిపెట్టుకోబోమని స్పష్టం చేశారు.
అధికారులు తగిన చర్యలు తీసుకోకపోతే, తాము కలెక్టర్‌ను కలిసి నిరసన తెలుపుతామని, అవసరమైతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని రైతులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై ప్రభుత్వ స్పందన ఏమిటో చూడాల్సి ఉందని రైతులు తెలిపారు. వ్యవసాయ నీటి హక్కులను కాపాడాలని కోరుతూ రైతుల నిరసన కొనసాగుతోంది.
