మణికందన్ కథానాయకుడిగా నటించిన ‘కుడుంబాస్థాన్’ జనవరి 24న థియేటర్లలో విడుదలై, ఇప్పుడు ‘జీ 5’ లో స్ట్రీమింగ్ అవుతోంది. వినోత్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు రాజేశ్వర్ కలిసామి దర్శకత్వం వహించాడు. కుటుంబ విలువలు, ప్రేమ, డబ్బు వంటి అంశాలను ప్రస్తావిస్తూ కథ సాగుతుంది. శాన్వి మేఘన కథానాయికగా నటించగా, నివేదిత రాజప్పన్, గురు సోమసుందరం ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.
కథలో నవీన్ (మణికందన్) ప్రేమించిన వెన్నెల (శాన్వి మేఘన) ను కులాంతర వివాహం చేసుకుంటాడు. పెళ్లి తర్వాత ఉద్యోగం కోల్పోయిన నవీన్, భార్యకు నిజం చెప్పకుండానే అప్పులు చేస్తాడు. తన కుటుంబం, అక్కాబావలు డబ్బే ముఖ్యం అనే ధోరణితో ఉండగా, నవీన్ అనుబంధాల విలువను నమ్ముతాడు. చివరకు ఎవరి అభిప్రాయం మారిందనేది కథలో హైలైట్.
దర్శకుడు మన సమాజంలో ఉద్యోగం, కుటుంబ పోరాటం, డబ్బు మధ్య ఉన్న సంబంధాన్ని చక్కగా చూపించాడు. సంపాదించే మనిషిని గౌరవించే పరిస్థితిని, అతనికి సమస్యలు ఎదురైనప్పుడు అందరూ ఎలా మారిపోతారనే అంశాన్ని ఆవిష్కరించాడు. నవీన్ క్యారెక్టర్ ద్వారా మన జీవితం, కుటుంబ సంబంధాలను కొత్తగా ఆలోచించేలా చేస్తుంది.
సాంకేతికంగా సినిమాను సహజత్వానికి దగ్గరగా మలిచారు. సుజిత్ సుబ్రహ్మణ్యం సినిమాటోగ్రఫీ, వైశాఖ్ నేపథ్య సంగీతం, కన్నన్ బాలు ఎడిటింగ్ బాగుంది. మంచి కథ, నటన ఉన్నా, కామెడీ కొంచెం తక్కువగా అనిపించొచ్చు. అయినా సహజమైన కథనంతో ‘కుడుంబాస్థాన్’ అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా.
