శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం బొబ్బిలిపేటలో వైసీపీ నేత చంద్రయ్య హత్య కేసులో పోలీసులు సంచలన విషయాలను బయటపెట్టారు. చంద్రయ్య భార్య ఈశ్వరమ్మ తన ప్రియుడు బాలమురళీ కృష్ణ సహాయంతో భర్తను హత్య చేయించినట్లు విచారణలో తేలింది. వివాహేతర సంబంధం భర్తకు తెలిసిపోవడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. చివరకు, భర్తను అడ్డుగా భావించి అతడిని హత్య చేయాలని ఆమె ప్లాన్ వేసింది.
హత్యకు ముందు బాలమురళీ కృష్ణ తన బంధువైన అరవింద్ సహాయంతో మరికొందరిని సంప్రదించాడు. ప్లాన్ ప్రకారం, నిందితులు మూడు రోజులపాటు చంద్రయ్యపై నిఘా పెట్టారు. చివరకు, బైక్‌పై వెళ్తున్న చంద్రయ్యను దారి మోసి బీరు సీసాలు, కర్రలతో దాడి చేసి హతమార్చారు. మృతదేహాన్ని గోనె సంచిలో వేసి చెరువు వద్ద పడేశారు. హత్య అనంతరం ఈశ్వరమ్మను ఫోన్‌లో సంప్రదించి ‘ఇక మనకు ఎవరూ అడ్డంకి కాదు’ అని బాలమురళీ కృష్ణ చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
మొదట చంద్రయ్య హత్య రాజకీయ కారణాలతో జరిగిందని పోలీసులు భావించారు. అయితే దర్యాప్తులో మద్యం సేవిస్తూ హత్య ప్రణాళిక రూపొందించిన నిందితుల సమాచారంతో అసలు విషయం బయటపడింది. నిందితులు మొత్తం పదిమంది ఉండగా, అందులో ఒకరు మైనర్. హత్యకు ఉపయోగించిన ఒక కారు, మూడు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నిందితులను అరెస్టు చేసి ఆమదాలవలస కోర్టులో హాజరుపరిచారు. భార్య వివాహేతర సంబంధం కారణంగా భర్త ప్రాణాలు కోల్పోవడం, ప్రియుడితో కలిసి కుట్ర పన్ని హత్య చేయించడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తక్షణ చర్యతో నిందితులు పట్టుబడటంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.