ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో ఫిబ్రవరి 6, 2025న ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారుల ఆదేశాల మేరకు చింతలపూడి మండలంలోని గాజులవారిపేట గ్రామంలో నాటు సారాయి తయారీపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో 200 లీటర్ల బెల్లపు ఓటను ధ్వంసం చేసి, 40 లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకున్నారు.
చింతలపూడి ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటు సారాయి వ్యాపారం చేస్తున్న కూతాడ వెంకన్న అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ఎక్సైజ్ సీఐ పి. అశోక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో హెడ్ కానిస్టేబుల్ పురుషోత్తమరావు, కానిస్టేబుళ్లు దుర్గాప్రసాద్, సత్యనారాయణ పాల్గొన్నారు.
అదనంగా, గతంలో నాటు సారాయి వ్యాపారంలో ప్రమేయం కలిగిన పలగాని రాటాలు అనే మహిళపై CR NO.63/2025 కింద కేసు నమోదైంది. తరచుగా నాటు సారాయి విక్రయిస్తున్నందుకు ఆమెకు తహసీల్దార్ ద్వారా ₹5000 జరిమానా విధించారు.
పాత ముద్దాయిలుగా ఉన్న పలగాని రాటాలు, జక్కుల లక్ష్మిలను 129 BNSS ప్రకారం తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేశారు. నాటు సారాయి వ్యాపారం నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.