కానిస్టేబుల్ అభ్యర్థులకు మెయిన్ ఎగ్జామ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) ఆధ్వర్యంలో విజయనగరంలో నిరసన చేపట్టారు. కోటజంక్షన్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించి, కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్‌కు వినతిపత్రం అందజేశారు.
డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ చి. హరీష్ మాట్లాడుతూ, 2022 నవంబర్ 28న 6100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదలై, 2023 జనవరి 22న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారని తెలిపారు. 95,208 మంది అర్హత సాధించినా, ఎమ్మెల్సీ ఎన్నికలు, కోర్టు కేసులు కారణంగా మెయిన్ ఎగ్జామ్ నిలిచిపోయిందని అన్నారు.
రెండేళ్లుగా నిరుద్యోగులు రాత్రింబవళ్లు కష్టపడి చదువుతున్నారని, రీడింగ్ రూమ్‌లు, కోచింగ్ సెంటర్ల రెంట్లు కట్టలేక ఇబ్బంది పడుతున్నారని అభ్యర్థుల పరిస్థితిని వివరించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మెయిన్ ఎగ్జామ్ నిర్వహించాలని, నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో డివైఎఫ్ఐ అధ్యక్షుడు బి. సతీష్, నాయకులు నాగరాజు, శివ, లక్ష్మణ్, శంకర్, సోమేశ్, రాజు, సూరిబాబు, లక్ష్మి, జయలక్ష్మి, శిరీషతో పాటు 250 మంది కానిస్టేబుల్ అభ్యర్థులు పాల్గొన్నారు. ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవాలని నేతలు హెచ్చరించారు.
