రోజుకు రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు టీ, కాఫీ తాగే వారంతా ఇకపై జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్‌లోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్) పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చక్కెరతో కలిపిన టీ, కాఫీలను తరచుగా తాగితే ఊబకాయం, మధుమేహం వచ్చే అవకాశాలు పెరుగుతాయని పరిశోధకులు ప్రొఫెసర్ ఉల్లాస్ ఎస్.కొల్తూర్, ప్రొఫెసర్ మహేందర్ తెలిపారు.
రెండేళ్ల పాటు ఎలుకలపై నిర్వహించిన అధ్యయనంలో టీ, కాఫీల్లో ఉండే చక్కెర శరీరంలో కాలేయం, కండరాలు, చిన్న పేగులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వెల్లడైంది. ఈ పరిశోధన ఫలితాలను అమెరికాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ డైటరీ డేటాబేస్‌తో పోల్చినట్టు వారు తెలిపారు. ఈ పరిశోధన వివరాలు ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ ‘న్యూట్రిషనల్ బయో కెమిస్ట్రీ’లో ప్రచురించబడ్డాయి.
చక్కెరతో కూడిన టీ, కాఫీ మాత్రమే కాకుండా, కూల్‌డ్రింక్స్ కూడా టైప్-2 మధుమేహానికి దారితీసే అవకాశముందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. టీ, కాఫీకి అలవాటున్న వారు వీటిని చక్కెర లేకుండా తాగడానికి ప్రయత్నించాలన్నారు. ఇంకా శీతల పానీయాలను పూర్తిగా మానుకోవడం ఉత్తమమని సూచించారు.
పరిశోధకుల సూచనల ప్రకారం, అధిక చక్కెరను శరీరానికి అందించడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల టీ, కాఫీల వినియోగాన్ని నియంత్రించుకోవడం, కూల్‌డ్రింక్స్‌కు దూరంగా ఉండటం మధుమేహం, ఊబకాయం ప్రమాదాన్ని తగ్గించగలదని నిపుణులు అంటున్నారు.