మనలో చాలా మంది ఉదయాన్నే ఓ కప్పు టీ లేదా కాఫీ తాగకుండా రోజూ పనులు మొదలు పెడతారు. ఆరోగ్యానికి ఇది హానికరమని కొందరు హెచ్చరికలు ఇచ్చినప్పటికీ, చాలా మందికి ఇది అలవాటే. అయితే, తాజా అధ్యయనం ప్రకారం, టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉన్నవారిలో తల, మెడ క్యాన్సర్ ముప్పు తగ్గే అవకాశం ఉందని వెల్లడైంది.
‘క్యాన్సర్ జర్నల్’లో ప్రచురితమైన ఈ అధ్యయనాన్ని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ నిర్వహించింది. ఇందులో ‘ఇంటర్నేషనల్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఎపిడెమియాలజీ కన్సార్టియం’ డేటాను విశ్లేషించారు. 14 రీసెర్చ్‌ల డేటాను పరిశీలించి, తల, మెడ క్యాన్సర్‌తో బాధపడుతున్న 9,500 మందిని, క్యాన్సర్ లేని 15,700 మందిని సమీక్షించారు.
ప్రతిరోజూ టీ లేదా కాఫీ తాగేవారిలో తల, మెడ క్యాన్సర్ రాకపోవడానికి 17% తగ్గుదల కనిపించిందని పరిశోధకులు తెలిపారు. 4 కప్పుల కాఫీ తాగేవారిలో ఓరల్ కేవిటీ, గొంతు క్యాన్సర్ ప్రమాదం కూడా తగ్గిందని పేర్కొన్నారు.
ఈ అధ్యయనంలో కీలక విషయం ఏమిటంటే, కెఫిన్ లేని కాఫీ కూడా ప్రయోజనకరమైనదిగా తేలింది. టీ, కాఫీ కలసి తాగడం హైపోఫారింజియల్ క్యాన్సర్ ప్రమాదాన్ని 29% వరకు తగ్గించగలదని, మరియు ఒక కప్పు టీ తాగడం ద్వారా తల, మెడ క్యాన్సర్ ముప్పు 9% తగ్గుతుందని తెలుస్తోంది.