బీజేపీ సీనియర్ నేత, పశ్చిమ బెంగాల్ మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. 60 ఏళ్ల వయసులో ఆయన వివాహబంధానికి లోనయ్యారు. శుక్రవారం పార్టీ మహిళా నేత రింకూ మజుందార్‌తో కోల్‌కతా సమీపంలోని తన నివాసంలో పుట్టినింటి వద్ద పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుక వైదిక సంప్రదాయాల మేరకు కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య నిర్వహించబడింది.
వివాహం అనంతరం మీడియాతో మాట్లాడిన దిలీప్ ఘోష్… తన తల్లి కోరిక మేరకే పెళ్లికి సిద్ధమయ్యానని తెలిపారు. తన వ్యక్తిగత జీవితం వల్ల రాజకీయ జీవితంపై ప్రభావం ఉండదని స్పష్టం చేశారు. బంగాల్ సీఎం మమతా బెనర్జీ సహా పలువురు రాజకీయ నేతలు శుభాకాంక్షలు పంపినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కొత్త జీవితాన్ని సంతోషంగా ప్రారంభించానని చెప్పారు.
దిలీప్ ఘోష్, రింకూ మజుందార్ పరిచయం 2021లో ఎకో పార్క్ వాకింగ్ సమయంలో మొదలైంది. అక్కడినుంచి బంధం ప్రేమగా మారింది. ఇటీవల ఓ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా తమ బంధాన్ని అధికారికం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు రింకూ చెప్పారు. తనే పెళ్లికి ప్రస్తావన తీసుకురాగానే ఘోష్ వెంటనే అంగీకరించారని చెప్పారు.
వివాహ వేడుకకు బీజేపీ నేతలు, మిత్రులు హాజరై దంపతులను ఆశీర్వదించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ హాజరయ్యారు. మమతా బెనర్జీ రెండు బొకేలు, లేఖ పంపి శుభాకాంక్షలు తెలిపారు. టీఎంసీ నేత కునాల్ ఘోష్… ఎకో పార్క్ ప్రేమకు కధానాయకురాలు మమతాయే అంటూ ట్వీట్ చేశారు. అయితే, సువేందు అధికారి స్పందించేందుకు నిరాకరించారు.
