చెన్నై సూపర్ కింగ్స్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ తన ఐపీఎల్ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ 2025 తన చివరి సీజన్ అవుతుందా లేదా అన్న దానిపై తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. జులైలో 44వ పుట్టినరోజు జరుపుకోనున్న ధోనీ, ఏడాదిలో కేవలం రెండు నెలల మ్యాచ్‌ల కోసం మిగతా ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు శరీరాన్ని సిద్ధం చేయాల్సి ఉంటుందన్న ఒత్తిడి ఎక్కువగా అనిపిస్తోందని తెలిపారు. తాను ఇంకా తేల్చుకోలేదని, శరీర పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటానని పేర్కొన్నారు.
కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం ధోనీ ఈ వ్యాఖ్యలు చేశారు. అభిమానుల నుంచి వస్తున్న ప్రేమ, ఆదరణ తనను ఎంతో ప్రోత్సహిస్తోందని అన్నారు. చెన్నై తరఫున ప్రస్తుతం మోకాలి గాయంతో బాధపడుతున్న ధోనీ ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయలేకపోతున్నారని హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వెల్లడించారు. అయినప్పటికీ, బుధవారం జరిగిన మ్యాచ్‌లో చివర్లో వచ్చిన ధోనీ శివమ్ దూబేకు సహకరిస్తూ ఒక కీలక సిక్సర్ కొట్టి జట్టుకు విజయాన్ని అందించారు.
సీఎస్కే ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన నేపథ్యంలో ధోనీ తన దృష్టిని భవిష్యత్తుపై పెట్టారు. ఐపీఎల్ 2026 కోసం జట్టును సిద్ధం చేయాలని భావిస్తున్నామని తెలిపారు. యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తూ జట్టు నిర్మాణంపై దృష్టి సారించామని చెప్పారు. ఉర్విల్ పటేల్ తన తొలి మ్యాచ్‌లోనే 11 బంతుల్లో 31 పరుగులు చేసి ఆకట్టుకోగా, బ్రెవిస్ అర్ధశతకం సాధించాడు.
“నెట్స్‌లో ఆటగాళ్ల ప్రతిభను చూడొచ్చు కానీ ఒత్తిడిలో వారి మానసిక స్థైర్యం ఎలా ఉంటుందో అసలైన మ్యాచ్‌ల్లో తెలుస్తుంది” అని ధోనీ చెప్పారు. సాంకేతికంగా గొప్ప ఆటగాడు కంటే, బౌలర్ల వ్యూహాలను అర్థం చేసుకునే ఆటగాళ్లే ఎక్కువ కాలం రాణిస్తారని చెప్పారు. అందుకే యువ క్రికెటర్ల ఎంపికలో మానసిక ధైర్యాన్ని ప్రాధాన్యతగా తీసుకుంటున్నామని వెల్లడించారు.
