ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. పెళ్లికి సిద్ధంగా కూర్చున్న వధువు ఏడుస్తుండటాన్ని గమనించిన భక్తులు, భద్రతా సిబ్బంది వెంటనే స్పందించారు. పెళ్లి మంటపంలోనే యువతి కళ్లలో నీరు చూసినవారు ఆమె వద్దకు వెళ్లి కారణం అడిగారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఆ యువతి వాపోతూ చెప్పిన విషయాలు అందరినీ షాక్‌కు గురిచేశాయి. తన వయసు 22 సంవత్సరాలు మాత్రమేనని, కానీ తనకంటే రెట్టింపు వయసు ఉన్న 42 ఏళ్ల వ్యక్తితో కుటుంబ సభ్యులు బలవంతంగా వివాహం జరిపించాలనుకుంటున్నారని తెలిపింది. తాను ఈ పెళ్లికి సున్నితంగా నిరాకరించినా, ఎవ్వరి మాట కూడా వినడం లేదని వాపోయింది.
భక్తులు ఈ విషయం తెలుసుకొని పెళ్లిని నిలిపివేశారు. తక్షణమే పోలీసులు సమాచారం ఇచ్చారు. కొద్దిసేపటికే పోలీసులు మంటపానికి చేరుకుని వధూవరులతో పాటు వారి కుటుంబ సభ్యులను స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.
ఇలాంటి సంఘటనలు పుణ్యక్షేత్రాల్లో జరగడం భక్తులను తీవ్రంగా కలిచివేస్తోంది. పెళ్లికి వధూవరుల అంగీకారం తప్పనిసరిగా ఉండాల్సిందని భక్తులు భావిస్తున్నారు. యువతుల హక్కులు, భావోద్వేగాలను గౌరవించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. పోలీసుల విచారణ తర్వాత పూర్తిస్థాయిలో నిజాలు వెలుగులోకి రావచ్చు.
