వేసవి వేడి నుంచి ఉపశమనం కోసం చల్లటి ఐస్ క్రీం తింటున్నారా? అయితే ఒక్క క్షణం ఆలోచించండి. బెంగళూరులో తయారవుతున్న ఐస్ క్రీంలలో పాలకు బదులుగా డిటర్జెంట్ పౌడర్, యూరియా వంటివి వాడుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు. ఇది కేవలం బెంగళూరుకు మాత్రమే పరిమితం కాకుండా, కర్ణాటకలో ఇతర ప్రాంతాల్లో తయారవుతున్న ఐస్ క్రీంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది.
ఇటీవల అధికారులు రెండు రోజుల పాటు బెంగళూరు సహా వివిధ జిల్లాల్లో 220 దుకాణాలు, ఫ్యాక్టరీలను తనిఖీ చేశారు. చాలా చోట్ల అపరిశుభ్రమైన వాతావరణంలో ఐస్ క్రీంలు, శీతల పానీయాలు తయారవుతున్నట్టు గుర్తించారు. కృత్రిమంగా తయారైన పాలలో డిటర్జెంట్, యూరియా మిశ్రమాలు ఉండటంతో ఆరోగ్యానికి తీవ్ర హానికరం అవుతుందని హెచ్చరించారు.
తయారీదారులు తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందాలనే దురుద్దేశంతో ఈ విధమైన ప్రమాదకరమైన పదార్థాలను వాడుతున్నారని అధికారులు తెలిపారు. కొన్ని శీతల పానీయాల్లో హాని చేసే రసాయనాల మోతాదులు కూడా పెరిగినట్టు గుర్తించారు. దీని వల్ల ఎముకలు బలహీనపడే ప్రమాదం ఉందని వెల్లడించారు.
ఈ తనిఖీల అనంతరం 97 దుకాణాలు, ఫ్యాక్టరీలకు నోటీసులు జారీ చేశారు. అలాగే మిగతా సంస్థలకు హెచ్చరికలు ఇచ్చి తయారీ ప్రక్రియలో మార్పులు తేవాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రత్యేకించి పిల్లలకు ఇలాంటి లోకల్ ఐస్ క్రీంలు, క్యాండీలు, డ్రింకులు కొనకుండా జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు.