చిత్తూరు జిల్లా కుప్పం కొత్తపేట మార్కెట్ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఎన్టీఆర్ సుజల త్రాగునీరు ట్యాంక్ చెడిపోయి గత ఆరు నెలలుగా నిరుపయోగంగా ఉంది. దీనికి సంబంధించి అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలుగుదేశం పార్టీ మాజీ మైనార్టీ అధ్యక్షుడు అస్లాం భాషా ఆరోపించారు. ప్రజలు త్రాగునీటి కోసం ఎన్టీఆర్ కాలనీ, బాయ్స్ హైస్కూల్ వరకు వెళ్లాల్సి వస్తోందని పేర్కొన్నారు.
నివాసితుల ఇబ్బందులను లెక్కచేయకుండా మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహించడం బాధాకరమని అస్లాం భాషా అన్నారు. కుప్పం నియోజకవర్గ ప్రజలు నీటి సమస్యలు ఎదుర్కొనకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, స్థానిక మున్సిపల్ అధికారులు వాటిని పాటించడం లేదని విమర్శించారు. ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నా, ఇప్పటివరకు అధికారుల నుంచి ఎటువంటి చర్యలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొత్తపేట వాసులకు త్రాగునీటి కొరత పెద్ద సమస్యగా మారింది. ఎప్పటికైనా ఈ ఎన్టీఆర్ సుజల ట్యాంక్ మరమ్మతు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ట్యాంక్ పనిచేయకపోవడం వల్ల తాగునీరు దూరప్రాంతాల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను అధిగమించేందుకు మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇకనైనా ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో కుప్పం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన చేపడతామని అస్లాం భాషా హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తక్షణమే ట్యాంక్ మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.

 
				 
				
			 
				
			 
				
			