పార్వతీపురం మన్యం జిల్లాలో లక్ష ఎకరాల్లో సాగు చేస్తున్న జీడి మామిడి రైతులు గిట్టుబాటు ధర లేకుండా దళారుల చేతిలో మోసపోతున్నారు. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణమే క్వింటాకు రూ. 20,000 మద్దతు ధర ప్రకటించి, జిసిసి ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ప్రభుత్వాన్ని కోరారు.
పార్వతీపురం ప్రజా సంఘాల కార్యాలయంలో జరిగిన సమావేశంలో రైతుల సమస్యలపై చర్చించగా, జీడి పిక్కల ప్రాసెసింగ్ యూనిట్‌ను పార్వతీపురంలో కాకుండా, గిరిజనులు అధికంగా ఉన్న కురుపాంలో ఏర్పాటు చేయాలని సూచించారు. యూనిట్ అక్కడ ఉంటే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, పంట సేకరణ సులభంగా జరిగి ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ దీనిపై పునఃపరిశీలన చేయాలని విజ్ఞప్తి చేశారు.
అటవీ ఉత్పత్తుల కోసం ఏర్పాటు చేసిన జిసిసి ప్రస్తుతం నామమాత్రంగా మారిందని, దళారులు లాభపడుతున్నారని రైతు సంఘం ఆరోపించింది. చీపుర్లు, పసుపు, అల్లం, కుంకుడుకాయలు, పనస వంటి ఉత్పత్తులను ప్రభుత్వం నేరుగా జిసిసి ద్వారా కొనుగోలు చేసి గిరిజన రైతాంగాన్ని దళారుల నుండి రక్షించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, వాతావరణ ప్రభావంతో పంట నష్టపోతుండటంతో ప్రభుత్వం అవసరమైన మందులను పిచికారీ చేసి సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
పంట చేతికి వచ్చాక ధర పడిపోవడానికి దళారులే కారణమని, దీనికి పరిష్కారంగా బ్యాంకులు గిరిజన రైతులకు రుణాలు అందించి, పంట విక్రయించిన తర్వాత వడ్డీలేని విధంగా వసూలు చేయాలని రైతు సంఘం డిమాండ్ చేసింది. మార్చి నెలలో కురుపాంలో భారీ సదస్సు నిర్వహించి, ప్రభుత్వ మద్దతు ధర కోసం ఆందోళన కార్యాచరణ రూపొందించనున్నట్లు ప్రకటించారు.