బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో 7వ రోజు మూలా నక్షత్రం అమ్మవారు “కాళరాత్రి దేవి” అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి విశేష మూలానక్షత్ర సరస్వతి పూజ అష్టోత్తరనామార్చన లతో చతుఃషష్టి ఉపచార పూజాది కార్యక్రమాలను వైదిక బృందం నిర్వహించి వివిధ కూరగాయలతో ‘కిచిడి’ నైవేద్యాన్ని నివేదించారు. అమ్మవారి మూలా నక్షత్రం అక్షరాభ్యాసానికి విశేషమైనందున భక్తుల రద్దీకి తగినట్లు ఈ రోజు ప్రాతః కాలం 02-00గంటల నుండి అక్షరాభ్యాస మండపాలలో వైదిక బృందంచే అక్షర శ్రీకర పూజలను నిర్వహిస్తున్నారు. అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారి దర్శనానికి బారులు తీరి మొక్కులు చెల్లించుకున్నారు. గట్టి పోలీసు బందోబస్తు మధ్య ఆలయ అనువంశిక ఛైర్మెన్ శరత్ పాఠక్, స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్ మరియు ఆలయ ప్రధాన అర్చకులు సంజీవ్ మహారాజ్ నేతృత్వంలో ఆలయ ఈఓ విజయరామరావు ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
అమ్మవారి దర్శనానికి భక్తులకు 4 నుండి 6గంటల సమయం పడుతోంది.
బాసర క్షేత్రంలో కుల రహిత ఉచిత అన్నప్రసాద కేంద్రాలు…ఆలయ అన్నదాన సత్రంలో మహారాష్ట్ర నాందేడ్ జిల్లా వాస్తవ్యులు శ్రీశ్రీశ్రీ జగదీష్ మహారాజ్ ఆధ్వర్యంలో అలాగే ఆలయ సమీపంలోని కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీశ్రీశ్రీ మంగి రాములు మహరాజ్ స్వామీజీ ఆధ్వర్యంలో మరియు సాతెల్ గణేష్ గదుల సముదాయం వద్ద ఉమ్మాయి సంజీవరావు ఆధ్వర్యంలో శ్రీవారి భక్తు బృందం ఉచిత అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు.
:-
కాళరాత్రీ దుర్గాదేవి నవదుర్గల్లో ఏడవ అవతారం…
ఆశ్వీయుజ శుద్ధ సప్తమిన నవరాత్రులలో అమ్మవారి ని ఆరాధిస్తారు. కాళరాత్రీ అమ్మవారు సర్వలోకాల్లో సర్వజీవులలో నివసించే సర్వాంతర్యామిగా సర్వశుభంకరి గా అమ్మవారి భక్తులు కీర్తిస్తారు.
గార్దభము వాహన దారియై అమ్మవారు నాలుగు చేతులు కలిగి వజ్రాయుధం వరముద్ర ఖడ్గము అభయముద్రలతో భక్తులను అనుగ్రహిస్తోంది. కాళరాత్రి అమ్మవారిని స్మరించినంత మాత్రాన భూతప్రేత పిశాచగణములు పోయి గ్రహబాధలు తొలగిపోవునని పండితులు పేర్కొన్నారు.