వికారాబాద్ జిల్లా లగచర్ల లో ఫార్మాకంపెని ఏర్పాటు కోసం నిర్బంధం చేసి రైతుల నుండి భూముల సేకరణ చేయడం సరికాదని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మనేని వీరభధ్రం అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్( సిపిఎం జిల్లా కార్యాలయం ) లో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య, జూలకంటి రంగారెడ్డి, మల్లు లక్ష్మి, జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి లు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ….. సిఎం రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందని, రేపు గురువారం నాడు సిపిఐ, సిపిఐ ఎంఎల్ న్యూ డెమక్రసీ, ప్రజా పంధా, ఇతర వామపక్ష పార్టీలతో కలిసి లగచర్లకు వెళ్లి భాధిత రైతులను పరామర్శ చేస్తామని అన్నారు. రైతుల సమస్యలు తెలుసుకుని ముఖ్యమంత్రి తో మాట్లాడతామని అన్నారు. గతంలో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద ఫార్మా సిటి ఏర్పాటు కోసం భూసేకరణ చేసినప్పుడు కూడ అక్కడి రైతులు వ్యతిరేకించారని అన్నారు.
