అనకాపల్లి జిల్లా చోడవరంనియోజకవర్గంలోని ఘగర్ ఫ్యాక్టరీ రైతుల పరిస్థితి రోజురోజుకు దిగజారుతున్నదని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యుడు డి వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో, కూటమి నాయకులు రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. రైతుల కష్టాలను అధికారంలో ఉన్న నేతలు అర్థం చేసుకోవాల్సింది పోయి, మొసలి కన్నీళ్లు కారుస్తూ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
ఇప్పటివరకు రైతుల సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్నికల సమయంలో ఘగర్ ఫ్యాక్టరీలను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చిన అనకాపల్లి ఎంపీ సిఎం రమేష్, ఇప్పుడు మౌనం పాటిస్తున్నారని ఆరోపించారు. జనసేన నేత పీవీఎస్ఎన్ రాజు కూడా రైతుల సమస్యలను పావుగా మార్చుకుని మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
రైతుల సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తామని జనసేన నాయకులు చెబుతున్నా, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వెంకన్న విమర్శించారు. బిజెపి భాగస్వామ్యంగా ఉన్నా, ప్రభుత్వం మాత్రం రైతులను ఆదుకోవడంలో విఫలమైందని అన్నారు. రైతులు తమ సమస్యలపై పోరాటం చేస్తూ మరింత కష్టాల్లో పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
గత సంవత్సరం ప్యాక్టరీలో పనిచేసిన కార్మికులు ఇప్పటికీ బకాయిలను పొందలేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. రైతులు నిద్రాహారాలు మాని ప్యాక్టరీ బయట నిరసనలు తెలియజేస్తున్నారని వివరించారు. కూటమి నాయకులు నాటకాలు ఆపి, హామీ ఇచ్చిన విధంగా ఫ్యాక్టరీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

 
				 
				
			 
				
			 
				
			