ఉపాధి హామీ పనుల్లో అవినీతికి పాల్పడుతున్నారని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు ఆరోపించారు. శుక్రవారం పార్వతీపురం సుందరయ్య భవనంలో విలేకరులతో మాట్లాడిన ఆయన, మక్కువ మండలం వెంకట భైరపురంలో అధికారుల నిర్లక్ష్యంతో ఉపాధి కూలీలకు నష్టమవుతోందని పేర్కొన్నారు.
ఉపాధి కూలీలతో తవ్వించాల్సిన ఫారం పండుగోతులు, ఇంకుడు గుంతలను జెసిబి యంత్రాలతో తవ్వించి, కూలీల పేరిట బిల్లులు చేయడం అవినీతికి నిదర్శనమని తెలిపారు. దీనివల్ల ఉపాధి కూలీలు పనుల నుంచి వెలివేయబడి, వారికి లభించాల్సిన కూలీ కోతకు గురవుతుందని గంగు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
వెంకట భైరపురంలో ఉపాధి పనులు లేక దళితులు, గిరిజనులు వలస వెళ్లే పరిస్థితి ఏర్పడిందని, అయినా అధికారులు రాజకీయంగా ప్రభావితమై యంత్రాలతో పనులు చేయడం సరైనది కాదని విమర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను లభ్యమయ్యేలా చూడాల్సిన అధికారులే, కూలీలకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.
ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఉపాధి కూలీలకు న్యాయం చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. ఉపాధి హామీ పథకం ఉద్దేశాలను దెబ్బతీసే విధంగా యంత్రాల వినియోగాన్ని అరికట్టాలని, లేదంటే పెద్దఎత్తున ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్నామని సిపిఎం నేతలు హెచ్చరించారు.