ఏపీ అధికారులు వైసీపీ కేడర్‌ను టార్గెట్ చేస్తూ వ్యవహరిస్తున్నారని ఎంపీ అవినాశ్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. తప్పుడు కేసులు బనాయించి వైసీపీ నేతలను అరెస్టు చేయడం దారుణమన్నారు. ఇప్పటి ప్రభుత్వానికి ఇది రాక్షసానందంగా మారిందని వ్యాఖ్యానించారు. ఇది సాధారణ రాజకీయాలు కాదు… కక్ష సాధింపు రాజకీయాలు అని విమర్శించారు.
వైసీపీ మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాను ఆయన స్వగృహంలో పరామర్శించిన అనంతరం అవినాశ్ మీడియాతో మాట్లాడారు. ఇటీవల అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన పరామర్శకు వెళ్లిన అవినాశ్ రెడ్డి అక్కడ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు.
“అహ్మద్ బాషాను ముంబైకి వెళ్లి, తీవ్రవాదిని పట్టుకున్నట్టుగా వ్యవహరించడం దారుణం. ఒక పౌరునిపై అప్రతిష్ఠ కలిగించేలా వ్యవహరించడాన్ని మేము సహించం. టీడీపీ నేతలు ఈ అరెస్టును సంబరంగా మారుస్తున్నారు. ఇది మానవత్వాన్ని అవమానించడమే” అని మండిపడ్డారు.
కడపలో టీడీపీ నాయకులు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని, కవ్వింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. “ఇవి మేము అన్ని గుర్తు పెట్టుకుంటాం. అక్రమ కేసులు వేసిన వారిని వదిలే ప్రసక్తే లేదు. ఇది ప్రజల సమక్షంలోనే చెబుతున్నా. బాధ్యత కలిగిన స్థానాల్లో ఉన్నవారు ఇలా వ్యవహరించడం దురదృష్టకరం” అని హెచ్చరించారు.