బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని మినగల్లు గ్రామ సమీపంలో గుత్తికొండ శ్రీరాములు విద్యాసంస్థల బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. స్థానికుల తెలిపిన వివరాల మేరకు పెనుబల్లి నుండి మినగల్లు వెళ్లే రహదారిలో ఈ ఘటన చోటుచేసుకుంది. అదుపుతప్పిన బస్సు పక్కనే ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లింది.
సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు బస్సును పరిశీలించారు. అదృష్టవశాత్తూ బస్సులో విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అయితే ఈ మార్గంలో తరచుగా వాహన ప్రమాదాలు జరుగుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల మినగల్లు గ్రామానికి వెళ్లే రహదారిలో అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. స్కూల్ బస్సులు, ఇతర విద్యాసంస్థ వాహనాలు పలుమార్లు బోల్తా పడిన ఘటనలు కూడా నమోదయ్యాయి. ఫిట్నెస్ లేని బస్సులు రహదారిపై నడవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి రోడ్ల మరమ్మతులతో పాటు పాఠశాల, కాలేజీ బస్సుల ఫిట్నెస్ పరీక్షలను కఠినంగా నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా సంబంధిత శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.