తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి జిల్లా, మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని స్పష్టమైన హెచ్చరికలు ఇచ్చారు. ఇప్పటికే వేటకు వెళ్ళిన వారిని వెంటనే తిరిగి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈనెల 27వ తేదీ వరకు మత్స్యకారులకు సముద్రంలోకి వెళ్లడంపై నిషేధం విధించారు. ధాన్యం పంటను ఈ కాలంలో కోయరాదని రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.
వర్షాల కారణంగా చెట్లు లేదా విద్యుత్ స్తంభాలు కూలినా, రహదారులు దెబ్బతిన్నా తక్షణమే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని, నిత్యవసరాలు అందుబాటులో ఉంచాలని సూచించారు.
సహాయక చర్యలకు సంబంధించి అన్ని యంత్రాంగాలను సిద్ధం చేయాలని, రెవిన్యూ అధికారులు మండల కేంద్రాల్లోనే ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పశువులు, పెంపుడు జంతువులకు అవసరమైన దాణా ముందుగా నిల్వ చేయాలని తెలిపారు. ఎలాంటి నష్టం జరగకుండా ప్రజలకు పూర్తిస్థాయి భద్రత కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
