ప్రధాని మోదీ తెలంగాణలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించడంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. మా ప్రభుత్వంపై మీరు చేసిన వ్యాఖ్యలు సత్యానికి దూరమని, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలను వివరించారు. బీఆర్ఎస్ పాలనతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేసిందని గుర్తుచేశారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతుల రుణమాఫీ, ఇంటి అవసరాలకు ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలను అమలు చేశామని తెలిపారు. 10 నెలల్లోనే లక్షల మంది మహిళలకు ప్రయోజనం చేకూర్చామన్నారు. అలాగే, గ్యాస్ సిలిండర్‌ను రూ.500కే అందిస్తూ ప్రజలపై భారం తగ్గించామని వివరించారు.
తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు, ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. యువతకు స్కిల్ యూనివర్సిటీలు, స్పోర్ట్స్ యూనివర్సిటీలు, విద్యార్థులకు పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నామని, చెరువులను రక్షిస్తూ తెలంగాణను మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామన్నారు.
