విశాఖ జిల్లా కంచరపాలెం సూర్య నగర్ ఏరియాలో చీటీలు, డబల్ ధమాకా స్కీముల పేరిట పెద్ద మోసం జరిగింది. ఈ మోసానికి 120 మంది మహిళలు బలయ్యారు. ప్రధానంగా అద్దిపల్లి శ్రీనివాసరావు భార్య సావిత్రి, మరికొంతమంది మహిళలతో కలిసి లాటరీ స్కీములు నడిపారు. బాధితులు తమ డబ్బులు తిరిగి అందించాలని పోలీసులను ఆశ్రయించారు.
ఈ స్కీంలో చొక్కాకుల నాగేశ్వరరావు, భార్య చిన్న తల్లి ముఖ్య వ్యక్తులుగా వ్యవహరించారు. వీరికి బొజ్జ గంగాధర్, కృష్ణ (గాజువాక సీఎంఆర్ ఎదురుగా ఉన్న ఫర్నిచర్ షాప్ యజమాని) సహకరించారని బాధితులు తెలిపారు. వారి ప్రేరణతోనే ఈ మోసం జరిగినట్లు తెలుస్తోంది. బాధిత మహిళలు మొదట ఐదో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కానీ న్యాయం జరగకపోవడంతో స్పందన కార్యాలయాన్ని ఆశ్రయించారు.
అక్కడ కూడా తమకు న్యాయం జరగలేదని బాధితులు వాపోయారు. చివరగా, గత ప్రభుత్వ హయాంలో ఉన్న పోలీస్ కమిషనర్‌ను కలిసి సమస్య వివరించారని తెలిపారు. అయితే ఎవరూ తమ సమస్యను పట్టించుకోలేదని బాధితులు చెబుతున్నారు. పోలీసులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా తమకు న్యాయం జరుగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం మోసగాళ్లు పెందుర్తిలో తలదాచుకున్నట్లు సమాచారం. బాధితులు మీడియా ద్వారా పోలీస్ కమిషనర్‌కి ఈ విషయం తెలియజేయాలని కోరుతున్నారు. తమ వద్ద ఉన్న చెక్కులు, ఫోటోలు, ఇతర ఆధారాలను మీడియా ముందు ప్రదర్శించారు. తమ డబ్బులను తిరిగి పొందేందుకు ప్రభుత్వం, పోలీసులు సహకరించాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.

 
				 
				
			 
				
			 
				
			