భారతదేశానికి పొరుగున ఉన్న చైనా తరచూ వివాదాలు సృష్టిస్తూ సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కారణమవుతూనే ఉంది. ముఖ్యంగా పాకిస్థాన్‌కు మద్దతు ఇస్తూ భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ వస్తోంది. కానీ తాజా పరిణామాలు చైనా వైఖరిలో మార్పునకు దారితీశాయి. దీనికి ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఆర్ధిక నిర్ణయాలే.
ట్రంప్ ఊహించని విధంగా చైనాపై 125 శాతం ప్రతీకార సుంకాలను విధించడంతో బీజింగ్‌లో కలకలం రేగింది. దీని ప్రభావంతో చైనా ఆర్ధికంగా ఒత్తిడిలో పడింది. ప్రపంచ వాణిజ్యంలో తన స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే ఇతర దేశాలతో మైత్రీ సంబంధాలు పెంచుకోవాల్సిన పరిస్థితి చైనాకు ఏర్పడింది. ఇందులో భాగంగా భారత్ వైపు చైనా ఓ మంచి సంకేతం ఇచ్చింది.
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తాజాగా బీజింగ్‌లో జరిగిన కమిటీ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో అభిప్రాయ భేదాలను తగ్గించుకుని వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముమ్మరం చేయాలన్నదే తమ ఆలోచన అని చెప్పారు. సరఫరా వ్యవస్థల విషయంలో భారత్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
ఇరు దేశాల మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలను పరిష్కరించుకోవాలని, భవిష్యత్‌లో ఉమ్మడి సమాజ నిర్మాణానికి ముందడుగు వేయాలన్నదే తమ సంకల్పమని జిన్ పింగ్ అన్నారు. అయితే చైనా నుంచి వచ్చిన ఈ ప్రకటనకు భారత్ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇది ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందా? లేదా కేవలం ఆర్ధిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు చైనా వేసిన నాటకమేనా? అనే అనుమానాలు కూడా వెల్లివిరుస్తున్నాయి.