ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు హైదరాబాద్ లో నిర్వహించబోయే 12వ అంతర్జాతీయ తెలుగు మహాసభలలో పాల్గొననున్నారు. ఈ మహాసభలు హెచ్ఐసీసీ నోవాటెల్ లో మూడు రోజుల పాటు జరగనున్నాయి. ప్రారంభ కార్యక్రమానికి చంద్రబాబు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వంటి ప్రముఖులు హాజరవుతారు. ముగింపు కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు.
ఈ వేడుకలకు సినీ, రాజకీయ, వ్యాపార రంగ ప్రముఖులు తరలివస్తున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, జయప్రద, జయసుధ, మురళీమోహన్ వంటి సినీ ప్రముఖులు కూడా ఈ మహాసభల్లో పాల్గొననున్నారు. మహాసభలను తెలుగుదనం ఉట్టిపడేలా నిర్వహించేందుకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
కూచిపూడి నృత్యరూపకాలు, జానపద కళాకారుల ప్రదర్శనలు, సినీ సంగీత విభావరి, సాహితీ రూపకాలు వంటి పలు కార్యక్రమాలు ఈ మహాసభల్లో ఆకర్షణగా నిలవనున్నాయి. భాష, సంస్కృతి, సాహిత్యం పై ప్రసంగాలు కూడా ఈ సభలను ప్రత్యేకంగా నిలబెడతాయి.
విదేశాల్లో ఉన్న తెలుగు సంఘాల నాయకులు కూడా మహాసభలకు తరలివస్తున్నారు. తెలుగు సంస్కృతిని పటిష్టం చేయడానికి అందరూ ఈ మహాసభలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు.
