రైతు బాంధవుడు… పద్మవిభూపణ్ రైతుల కోసం జీవితాంతం అలుపెరగని ఉద్యమాలతో రైతుల వెన్నంటి ఉన్న మహోన్నత వ్యక్తి ఆచార్య ఎన్జీ రంగా అని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని శాంతినగర్ కాలనీలో ఉన్న గాంధీజీ స్మృతి వనంలో ఆచార్య ఎన్జీ రంగా 124వ జయంతిని పురస్కరించుకొని ఎమ్మెల్యే శంకర్ గురువారం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏరువాకను జోరువాకగా మార్చి..రైతుల జీవితాలలో వెలుగులు నింపేందుకు చట్టసభల లోపల, వెలుపల అలుపెరుగని పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించిన రైతు పక్షపాతి ఎన్జి రంగా అని చెప్పారు.
స్వతంత్ర భారతంలో రైతులు ఆత్మగౌరవంతో బ్రతికేందుకు వ్యవసాయాన్ని పండుగజేసేందుకే తనసమయాన్ని పూర్తికాలం వెచ్చించిన మహనీయుడు డాక్టర్ రంగా అని కొనియాడారు. భారత స్వాతంత్రోద్యమంలో మహాత్మాగాంధీ, సర్ధార్ వల్లభభాయి పటేల్, రాజాజీ వంటి మహనీయులతో కలిసి రంగా పోరాటం సాగించారన్నారు. బ్రిటీష్ సామ్రాజ్యం పాలనలో 1926లో ఒంగోలు ప్రాంతంలో కరవు రావడంతో శిస్తు మాఫీ చేయించడంతో పాటు రైలులో పశువులకు పశుగ్రాసం తెప్పించి ఆదుకున్నారని చెప్పారు.
బ్రిటీష్ వారితో మాట్లాడి రైతుల సమస్యలను పరిష్కరించినందుకు రాజాజీ.. రంగాకు సర్దార్ బిరుదు ఇస్తామని చెప్పగా.. తన శిష్యుడు గౌతు లచ్చన్నకు ఇప్పించి నిస్వార్థపరుడిగా పేరొందారని వివరించారు. భారత పార్లమెంట్ లో 1930 నుంచి 1991 వరకు సుదీర్ఘకాలం సభ్యుడిగా కొనసాగి రైతుల పక్షాన గళం వినిపించారని స్పష్టం చేశారు. నిరంతరం రైతుల అభ్యున్నతి కోసం పాటుపడ్డారన్నారు. దేశతొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ నుంచి రాజీవ్ గాంధీ వరకు ప్రధానమంత్రులుగా పనిచేసిన కాలంలో రైతుల సమస్యల కోసం పోరాడి పరిష్కారానికి కృషి చేశారని తెలిపారు. కేంద్ర మంత్రి పదవి ఇస్తామన్నా రంగా స్వీకరించకుండా రైతుల పక్షాన పోరాటం చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, గాంధీ మందిర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.