బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న యూట్యూబర్లు, ఇన్‌ఫ్లూయన్సర్లపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇటీవల విశాఖలో లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఇప్పుడు హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయిపైనా కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో పేదలకు సహాయం చేస్తున్నట్లు పబ్లిసిటీ చేసుకుంటూ, పెద్ద ఎత్తున బెట్టింగ్ యాప్స్ ద్వారా డబ్బు సంపాదించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
హర్ష సాయి తన చర్యలను సమర్థించుకుంటూ, తాను చేయకపోతే మరొకరు చేస్తారని చెప్పడం వివాదాస్పదంగా మారింది. ఇదే కారణంగా పలువురు బాధితులు అతనిపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో ఓ సినీ హీరోయిన్ ఫిర్యాదుతో పరారైన హర్ష సాయి, బెయిల్ పొందిన తర్వాత తిరిగి బయటకు వచ్చారు. ఇప్పుడు కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారా, లేక మళ్లీ పరారవుతారా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.
ఈ బెట్టింగ్ యాప్స్ ప్రచారంలో ప్రముఖ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ సహా పలువురు ఇన్‌ఫ్లూయన్సర్లు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు ఇప్పటికే బయ్యా సన్నీ యాదవ్ పై కేసు నమోదు చేశారు. అయితే, అతను ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. పోలీసులు త్వరలోనే అతడిని అరెస్ట్ చేస్తామని ప్రకటించారు.
ఈ వ్యవహారంలో వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆమె కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి లక్షలాది రూపాయలు సంపాదించినట్లు ఆరోపణలు ఉన్నాయి. శ్యామల ప్రమోట్ చేసిన యాప్‌ల వీడియోలు వైరల్ అవుతున్నా, ఇప్పటి వరకు ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రాజకీయ అండ లేనివారిపై మాత్రమే కేసులు పెడుతున్నారా? శ్యామలపై కూడా కేసు నమోదు చేస్తారా? అనే ప్రశ్నలు జనంలో చర్చనీయాంశంగా మారాయి.
