మంచు మనోజ్, తన భార్య భూమా మౌనికతో జల్‌పల్లి నివాసానికి చేరుకున్న సమయంలో రాత్రి వివాదం తలెత్తింది. సెక్యూరిటీ సిబ్బంది వారిని లోపలికి అనుమతించకుండా గేట్లకు తాళాలు వేసి అడ్డుకున్నారు. అందులో తన చిన్నారి ఉన్నందున మనోజ్ విజ్ఞప్తి చేసినప్పటికీ పరిస్థితి దిగజారింది. చివరికి బలవంతంగా లోపలికి వెళ్లడంతో ఉద్రిక్తత పెరిగింది.
ఈ వివాదం క్రమంలో మంచు మనోజ్ గాయాలతో కనిపించగా, ఈ సంఘటనను కవర్ చేయడానికి వచ్చిన మీడియా ప్రతినిధులపై మంచు మోహన్ బాబు దాడి చేసినట్లు ఆరోపణలు వినిపించాయి. ఒక జర్నలిస్టు మైక్ లాక్కొని దాడి చేయడంతో అతనికి గాయాలు అయినట్లు సమాచారం.
ఈ సంఘటనపై షహర్ పహాడీ పోలీస్ స్టేషన్‌లో మంచు మోహన్ బాబు పై 118 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. రాచకొండ సీపీ మోహన్ బాబును వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఈ కేసు విచారణలో నేరం రుజువైతే మోహన్ బాబుకు మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
అయితే ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వీడియో జర్నలిస్టుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మోహన్ బాబు పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసు మరింత వివరణకు లోనవుతుందని అంటున్నారు.