“భారత్‌లో ఒక సీతాకోక చిలుక రెక్కలు ఆడితే… అమెరికాలో గాలిదుమారం రావొచ్చు!” – ఇదే Butterfly Effect అని పిలిచే ఆసక్తికరమైన సిద్ధాంతం. అంటే… ఎక్కడో ఒక చిన్న మార్పు జరగడం, వేరే చోట పెద్ద సంఘటనలకు కారణం అవుతుందన్నమాట. ఈ కాన్సెప్ట్‌ను ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎడ్వర్డ్ లారెన్జ్ ప్రతిపాదించారు. ఇది Chaos Theory లో ఒక భాగం.
ఉదాహరణకి – ఒక బస్సు కొన్ని గంటలుగా ప్రయాణిస్తోంది. కాసేపు ఆగి, మళ్లీ బయలుదేరుతుంది. కొన్ని క్షణాల తర్వాత బస్సు కొండచరియల కింద పడిపోతుంది. అప్పుడు అందరూ అనుకునేది ఒక్కటే – “అది ఆగకపోయి ఉంటే… ఇలా జరగేదా?” అని. అంటే, ఒక చిన్న నిర్ణయం – భవిష్యత్తులో జరిగే ఘోర పరిణామాన్ని ప్రభావితం చేసిందన్నమాట.
👉 లారెన్జ్ కనుగొన్నది ఏమిటి?
లారెన్జ్ 1961లో గణిత సమీకరణాలతో వాతావరణ మార్పులను కంప్యూటర్లో అంచనా వేస్తున్నారు. అప్పుడు కంప్యూటర్ ఇచ్చిన ఒక సంఖ్య 0.506127. ఆయన దాన్ని 0.506గా రౌండ్ ఫిగర్ చేశారు. చిన్న తేడా అని వదిలేశారు. కానీ! చివరికి అంచనా ఫలితాల్లో భారీ మార్పులు వచ్చాయి. అప్పుడు ఆయన గ్రహించారు – చిన్న దశాంశాలు కూడా పెద్ద పరిణామాలకు దారి తీస్తాయి!
👉 అదే Butterfly Effect సారాంశం:
“ఒక చిన్న కారణం, భవిష్యత్తులో జరిగే పెద్ద సంఘటనలకు పునాది కావచ్చు.” ఉదాహరణకు, ఒక సీతాకోక చిలుక రెక్కలు ఊపడం వల్ల గాలిలో ఏర్పడిన చిన్న తరంగాలు, వందల కిలోమీటర్ల దూరంలో తుపానులకు కారణం కావచ్చు.
👉 సినిమాల్లో వినియోగం:
మన తెలుగు సినిమాల్లో కూడా Butterfly Effect కాన్సెప్ట్ని వినియోగించారు. సుకుమార్ సినిమాల్లో మీరు గమనిస్తే – ఒక చిన్న సంఘటన, తర్వాతి మొత్తం కథను మలుపు తిప్పుతుంది. అదే ఈ థియరీ సారాంశం.