కర్ణాటకలో ఓ ఆర్టీసీ డ్రైవర్ విధి నిర్వహణలో ఉండగానే బస్సును నడిరోడ్డుపై ఆపి నమాజ్ చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. ప్రయాణికులతో నిండిన బస్సులోనే డ్రైవర్ ప్రార్థన చేయడం బాధితులను ఇబ్బందుల్లోకి నెట్టింది. ఈ దృశ్యాలను కొంతమంది ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఘటనపై దృష్టి సారించారు అధికారులు.
ఈ సంఘటన మంగళవారం సాయంత్రం హుబ్లీ-హవేరి మార్గంలోని జవేరి సమీపంలో చోటుచేసుకుంది. ఆర్టీసీకి చెందిన బస్సును డ్రైవర్ రహదారి పక్కన ఆపి, ప్రయాణికుల మధ్యలోనే ఓ సీటుపై కూర్చుని నమాజ్ చేశారు. బస్సులో ఉన్న ప్రయాణికులు నిరీక్షించాల్సి రావడంతో, వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. దీనిపై అధికారులు స్పందించి విచారణకు ఆదేశించారు.
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి దీనిపై స్పందిస్తూ, విధి సమయంలో ఇలా ప్రార్థన చేయడం అనైతికమని పేర్కొన్నారు. సర్వీసు సమయంలో మతాచరణలు నిబంధనలకు విరుద్ధమని, ఇటువంటి చర్యలు ఆర్టీసీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉంటాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యుడిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆర్టీసీ మేనేజర్‌కు మంత్రి రాసిన లేఖలో, సిబ్బంది విధులకు కట్టుబడి ఉండాలని, ప్రభుత్వ ఉద్యోగిగా నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఈ ఘటనపై లోతుగా విచారణ జరుగుతోంది.
