ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో అమానుష ఘటన చోటుచేసుకుంది. భాగవతం వినడానికి వెళ్లిన 22 ఏళ్ల దళిత యువతి తిరిగి ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవగా, మరుసటి రోజు ఆమె మృతదేహాన్ని సమీప కాలువలో గుర్తించారు. మృతదేహం కనీసం గుర్తించలేనంత దారుణంగా ఉండటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఆమెను కిరాతకంగా హింసించి, కాళ్లు చేతులు విరగొట్టడమే కాకుండా, కళ్లను పీకేసి, మర్మావయవాల్లో కర్రను ప్రవేశపెట్టారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ దారుణానికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గ్రామస్థులు ఈ ఘటనపై ఆగ్రహంతో రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు.
ఈ ఘటనపై ఫజియాబాద్ ఎంపీ అవధేశ్ తీవ్ర స్పందన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆయన, బాధ్యులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. “బాధితురాలికి న్యాయం జరగకపోతే ఎంపీ పదవికి రాజీనామా చేస్తాను” అంటూ కంటతడి పెట్టారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఈ దారుణంపై అధికార యంత్రాంగం స్పందించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. సామాజిక కార్యకర్తలు, రాజకీయ నేతలు ఈ ఘటనను ఖండిస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు.