క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, క్రీడాకారులు క్రమశిక్షణతో మెలిగి ఉన్నతంగా ఎదగాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో 68వ ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ స్కూల్ గేమ్స్ బాస్కెట్ బాల్ 2024-25 అండర్ 19 బాల బాలికల ఛాంపియన్ షిప్ పోటీలను ఎమ్మెల్యే గొండు శంకర్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలకంటే మిన్నగా ఏపీ స్టోర్ట్స్ నూతన పాలసీ ఉంటుందన్నారు. అందరికీ ఆటలు, టాలెంట్ గుర్తింపు, ప్రపంచస్థాయి శిక్షణ, ప్రోత్సాహకాలు, క్రీడాకారులకు మద్దతు, ఉద్యోగ భద్రత, ప్రపంచస్థాయి సౌకర్యాలు, క్రీడా సంఘాలతో సమన్వయం, టెక్నాలజీ వాడకం, ప్రైవేటు రంగంతో కలిసి పనిచేయడం, జాతీయ, అంతర్జాతీయస్థాయి ఈవెంట్స్ నిర్వహణ, స్పోర్స్ట్ టూరిజంవంటి అంశాలకు ప్రాధాన్యతనిచ్చారన్నారు.
గ్రామస్థాయి నుంచీ క్రీడల ప్రోత్సాహకానికి అవసరమైన ప్రణాళికను పొందుపరిచారని చెప్పారు. ఇప్పటి వరకు ఉద్యోగాల్లో ఉన్న క్రీడా కోటా రిజర్వేషన్‌ను 2 శాతం నుంచి 3 శాతానికి పెంచుతూ నిర్ణయం శుభపరిణామం అన్నారు. యూనిఫాం సర్వీసెస్‌లో 3శాతం రిజర్వేషన్ ఇవ్వాలని పాలసీలో ప్రతిపాదించారు. శాప్‌లో గ్రేడ్ 3 కోచ్‌ల కోసం ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించిన వారికి 50 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. ఒలంపిక్స్, ఏషియన్ గేమ్స్, వరల్డ్ చాంపియన్స్, నేషనల్ గేమ్స్, ఖేలో ఇండియా గేమ్స్, నేషనల్ స్కూల్ గేమ్స్‌లో పతకాలు పొందినవారికి ఇచ్చే ప్రోత్సాహకాన్ని భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. పతకాలు సాధించే క్రీడాకారులకు భారీ ప్రోత్సాహకాలు పతకాలు సాధించే వారికి మంచి ప్రోత్సాహకాలు అందిస్తే క్రీడలపట్ల అందరికీ ఆసక్తి పెరుగుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోందని చెప్పారు. ఆటలు ఆడేవాళ్లకు గుర్తింపు, గౌరవం ఇవ్వాలని తెలిపారు. అనంతరం వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులు చేసిన మార్చ్ ఫస్ట్ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో డీఈవో తిరుమల చైతన్య, ఇతర అధికారులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

 
				 
				
			 
				
			 
				
			