ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపై కాంగ్రెస్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్టుపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ పార్టీ “పాకిస్తాన్ నుంచి ఆదేశాలు తీసుకుంటోంది” అంటూ బీజేపీ ఆరోపణలు గుప్పించింది. కాంగ్రెస్ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో ఒక చిత్రాన్ని పోస్ట్ చేసింది, ఇందులో ప్రధానమంత్రి మోదీ తరచూ ధరించే పసుపు కుర్తా, తెల్ల పైజామా, నల్ల బూట్లు ఉన్నప్పటికీ, ప్రధాని ముఖం (ముఖచిత్రం) మాత్రం లేదు. ‘గాయబ్… అవసరమైన సమయంలో కనిపించడం లేదు’ అనే వ్యాఖ్యను జోడించింది.
ఈ పోస్ట్ ద్వారా, కాంగ్రెస్ పార్టీ పహల్గామ్ సంక్షోభ సమయంలో ప్రధాని అందుబాటులో లేరని, ముఖ్యంగా అఖిలపక్ష సమావేశానికి ఆయన హాజరుకాలేదని విమర్శించింది. అఖిలపక్ష సమావేశం అనంతరం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, “ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ప్రధాని హాజరుకావాలి” అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పోస్టుపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై విమర్శలు కురిపించారు. పాకిస్తాన్‌తో కుమ్మక్కైందని, రాహుల్ గాంధీ ఆదేశాలతో ఈ చౌకబారు ఎత్తుగడలు జరుగుతున్నాయని ఆరోపించారు. కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్, “మీరు (పాకిస్థాన్) మా రక్తం ఒక్క చుక్క చిందిస్తే, మేము (సింధు నది నుంచి) ఒక్క నీటి చుక్క కూడా ప్రవహించనివ్వం” అని మోదీ గట్టి హెచ్చరికలను గుర్తుచేశారు.
అమిత్ మాలవీయ ఈ పోస్టును “ముస్లిం ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుని, ప్రధానిపై పరోక్షంగా హింసను ప్రేరేపించే ప్రయత్నం” అని అభివర్ణించారు. “కాంగ్రెస్ ఇలాంటి వ్యూహాలకు పాల్పడటం ఇదే మొదటిసారి కాదు” అని ఆయన పేర్కొంటూ, రాహుల్ గాంధీ ప్రధానిపై హింసను ప్రేరేపించారని కూడా ఆరోపించారు.
ప్రధానమంత్రి, బీజేపీ నేతలపై వివిధ వ్యాఖ్యలు చేసిన కొద్ది రోజుల తరువాత, కాంగ్రెస్ పార్టీ “పాకిస్తాన్ నుంచి ఆదేశాలు తీసుకుంటోంది” అనే ఆరోపణలకు పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సభ్యుడు ఫవాద్ చౌదరి కూడా పోస్ట్ షేర్ చేశారని బీజేపీ నేత షెహజాద్ పూనావాలా తెలిపారు.

 
				 
				
			 
				
			 
				
			