బర్డ్ ఫ్లూ ప్రభావం భారతదేశంతో పాటు అమెరికాను కూడా కలవరపెడుతోంది. మన దేశంలో ప్రజలు చికెన్, గుడ్లు తినాలంటే భయపడుతుండటంతో అమ్మకాలు తగ్గాయి. అయితే అమెరికాలో దీనివల్ల గుడ్ల ధరలు అమాంతం పెరిగాయి. అక్కడ గుడ్లను ప్రోటీన్ ప్రధాన ఆహారంగా పరిగణిస్తారు. గుడ్లకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఉత్పత్తి తగ్గడం ధరలపై తీవ్ర ప్రభావం చూపించింది.
గత కొన్ని నెలలుగా బర్డ్ ఫ్లూ కారణంగా లక్షలాది కోళ్లు చనిపోతున్నాయి. గుడ్లు పెట్టే కోళ్ల సంఖ్య తగ్గిపోవడంతో ఉత్పత్తి భారీగా పడిపోయింది. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో డజను గుడ్ల ధర ₹867 (10 డాలర్లు)కి చేరింది. గత ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు గుడ్ల ధర 65% పెరిగింది. కొన్ని సూపర్ మార్కెట్లు వినియోగదారులకు గుడ్ల కొనుగోలుపై పరిమితులు విధించాయి.
ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా శరవేగంగా వ్యాపించే వ్యాధి. దీని నియంత్రణ కోసం అధికారులు లక్షల కోళ్లను సంహరించాల్సి వస్తోంది. కోళ్ల ఫారాల్లో పెంచే కోళ్ల కంటే దేశీయంగా పెంచే నాటు కోళ్లపై దీని ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఉత్పత్తి తగ్గిపోవడంతో మార్కెట్‌లో గుడ్ల కొరత ఏర్పడింది.
భారతదేశంలో కూడా బర్డ్ ఫ్లూ ప్రభావం గట్టిగా కనిపిస్తోంది. చికెన్, గుడ్లు తినాలనే భయంతో ప్రజలు వీటి కొనుగోలు తగ్గించారు. దీని వల్ల ఈ రంగంలో వ్యాపారులు నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇక అమెరికాలో అయితే గుడ్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఏవియన్ ఫ్లూ ఇంకా కొనసాగితే గుడ్ల కొరత తీవ్రంగా ఉండొచ్చు.
