బీసీలకు 42% రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా అమలుచేయాలని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయాలని కోరుతూ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంటులో బీసీల కోసం గళం విప్పారని తెలిపారు. ఆయన పోరాటంతో దేశంలోనే తెలంగాణ కులగణన ఆదర్శంగా మారుతుందని కాంగ్రెస్ ఆశించిందని, అయితే రాష్ట్ర ప్రభుత్వం మోసపూరిత లెక్కలు చూపించి, ఆ ఆశలకు నీళ్లు చల్లిందని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర కులగణనలో ఉద్దేశపూర్వకంగా అగ్రకులాల జనాభా పెంచి చూపించారని బీసీ నేతలు విమర్శించారు. కేవలం 7% ఉన్న అగ్రకులాలను 17%గా చూపడం వెనుక దుష్ట రాజకీయం దాగుందని తెలిపారు. బీహార్, కర్ణాటకలో బీసీల జనాభా 60% పైగా ఉన్నట్లు సర్వేలు తేల్చగా, తెలంగాణలో మాత్రం బీసీలను 46%గా చూపించడం కుట్రగా పేర్కొన్నారు. 2014లో జరిగిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 57% బీసీలు ఉన్నారని గుర్తుచేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కులగణన దోషాలను సరిచేసి నిజమైన గణాంకాలను ప్రకటించాలని బీసీ నాయకులు డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవకపోతే తీవ్ర ఉద్యమం చేసేందుకు సిద్ధమని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్లను తగ్గించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో ఓయూ జాక్ ఛైర్మన్ పాలడుగు శ్రీనివాస్, నగిరి ప్రవీణ్ కుమార్, వంగర సిద్దార్థ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎర్ర శ్రీహరి గౌడ్, పేదల రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు గణపతి బిక్కు మాత్రే మహారాజ్, బీసీ మహిళా సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కొండపల్లి రజిత పటేల్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సరిత ముదిరాజ్, అంబాదాస్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
